ములుగు జిల్లా కేంద్రంలో పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలి.
ములుగు, సెప్టెంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
ములుగు జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడు పైడిమల్ల భాస్కర్ గౌడ్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఆయనకు సముచిత గౌరవం కల్పించినట్లవుతుందని తెలిపారు.
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి లేదా ప్రజలకు అందుబాటులో ఉండే అనువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. పాపన్న గౌడ్ ఒక సామాజిక వర్గానికే పరిమితమైన నాయకుడు కాదని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన చారిత్రక వ్యక్తి అని పేర్కొన్నారు.
ఆయన జీవిత చరిత్ర, పోరాట స్ఫూర్తి, ప్రజల కోసం చేసిన కృషి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని భాస్కర్ గౌడ్ అన్నారు. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయింపు, అనుమతులు తదితర ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు కోరారు.విగ్రహ ఏర్పాటుకు గౌడ సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, యువత కలిసి ముందుకు రావాలని పైడిమల్ల భాస్కర్ గౌడ్ పిలుపునిచ్చారు.


Comments