ఆట.. పాట.. మాటతో ఉద్యమం.. ఇప్పుడు హక్కుల కోసం పోరాటం.
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆట, పాట, మాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన కళాకారులు.. ఇప్పుడు తమ హక్కుల సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. కళాకారుల ఉద్యోగాల సాధనతో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన “హలో కళాకారుడా.. చలో రవీంద్రభారతి” ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన సంఘం మండల ఇన్‌చార్జి, కళాకారుడు రాజోజు మధును ఎల్కతుర్తి పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా రాజోజు మధు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కళాకారులు తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టి ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. ఆట, పాట, మాటల ద్వారా ప్రజల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని గుర్తు చేశారు.
రాష్ట్రం ఏర్పడిన అనంతరం కళాకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అర్హులైన కళాకారులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కళాకారుల సమస్యలను పరిష్కరించకుండా కేవలం హామీలకే పరిమితం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం కళాకారుల ఉద్యోగాల సాధనపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.
“కళాకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చే వరకు మా ఉద్యమం ఆగదు. ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు. కళాకారుల హక్కుల కోసం శాంతియుతంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం” అని రాజోజు మధు అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన కోరారు. కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టి, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.


Comments