మహిళా సంఘాల నిధులపై విచారణ జరపాలి.
బుక్‌కీపర్, సీసీ, ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్.
అడ్డాకుల,సెప్టెంబర్30(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని వర్నె గ్రామ మహిళా సంఘాల్లో నిధుల అవకతవకలు జరిగాయంటూ గ్రామానికి చెందిన నవీన్‌కుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐకేపీ కేంద్రంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మండల ఏపీఎం, జిల్లా డీఆర్‌డీఏ అధికారులు, కలెక్టర్‌కు ప్రజావాణి, సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. బుక్‌కీపర్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇటీవల గ్రామానికి వచ్చిన జిల్లా అధికారులు కొద్దిమంది మహిళలతోనే విచారణ నిర్వహించారని, సంఘ సభ్యులందరి సమక్షంలో విచారణ చేపట్టాలని కోరారు. మహిళా సంఘ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే బాధ్యులైన బుక్‌కీపర్, సీసీ, ఏపీఎంపై చర్యలు తీసుకుని నిధులను రికవరీ చేయాలని, సంబంధిత సిబ్బందిని బదిలీ చేయాలని కలెక్టర్, ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో రవితేజ, తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments