కరీంనగర్ అభివృద్ధిపై సీఎంకు మేయర్ వినతి.
*కరీంనగర్ అభివృద్ధికి రూ.300 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వాలి*
*నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక అస్యూరెన్స్ ఫండ్*
*విలీన గ్రామాల అభివృద్ధి, పెండింగ్ నిధుల విడుదల ,నగర సమస్యలపై వినతిపత్రం సమర్పణ*
కరీంనగర్, సెప్టెంబర్ 30(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డికి నగర ప్రథమ పౌరుడు, మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. బుధవారం కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రికి మేయర్ పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర మంత్రులు, మేయర్ కొలగాని శ్రీనివాస్, శాసనసభ్యులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల భవనాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, అత్యవసర అభివృద్ధి పనుల కోసం రూ.300 కోట్ల ప్రత్యేక అస్యూరెన్స్ నిధులు తక్షణమే మంజూరు చేయాలని కోరారు.
సమీప గ్రామాలు నగరపాలక సంస్థలో విలీనం కావడంతో నగర జనాభా, భౌగోళిక విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని మేయర్ తెలిపారు. ప్రస్తుతం నగర జనాభా సుమారు 5 లక్షలకు చేరడంతో పాటు విస్తీర్ణం సుమారు 112 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
విలీన గ్రామాల డివిజన్లలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రూ.300 కోట్ల ప్రత్యేక అస్యూరెన్స్ నిధులు మంజూరు చేయాలని కోరినట్లు మేయర్ వెల్లడించారు. అలాగే గతంలో సీఎం అస్యూరెన్స్ పథకం కింద నగరపాలక సంస్థకు రావాల్సిన పెండింగ్ నిధులను కూడా విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.
కరీంనగర్ నగర అభివృద్ధి, ప్రజల సమస్యలకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.


Comments