అండర్-14 ఖో-ఖోలో ఎల్కతుర్తి మండలానికి ప్రథమ స్థానం.
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండలోని జీఎన్‌ఎస్‌లో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల్లో బాలికల అండర్-14 ఖో-ఖో విభాగంలో ఎల్కతుర్తి మండల జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. హోరాహోరీగా సాగిన పోటీల్లో విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించారు. వేగం, చురుకుదనం, సమష్టి కృషి, క్రీడా స్ఫూర్తితో జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.
ఈ సందర్భంగా ఎంఈఓ చదువుల సత్యనారాయణ మాట్లాడుతూ, ఎల్కతుర్తి మండల బాలికలు అండర్-14 ఖో-ఖోలో ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, పాఠశాల స్థాయి నుంచే క్రీడా ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సమష్టి భావన, శారీరక దారుఢ్యం పెంపొందుతాయని తెలిపారు. విజేతలైన విద్యార్థినులను, వారికి శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల వ్యాయామ ఉపాధ్యాయులు ధనలక్ష్మి, రాములు, సుధాకర్, ప్రేమ్, ప్రసాద్, స్వరూప, ప్రభావతి, శ్రీకాంత్, కర్రే తిరుపతి, ఉదయ్, పూర్ణిమ, ఉషారాణి, కిరణ్ రావు, స్వరూప తదితర వ్యాయామ ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.


Comments