మానవత్వానికి చిరునామా.. ఇప్పగూడెం శంకర్.
సొంత ఆటోతో ఉచిత వైద్య సేవలు
ఆపదలో ఉంటే చాలు.. 9000351405కు ఒక్క ఫోన్
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి కోట్లు అవసరం లేదని, మంచి మనసుంటే చాలని ఇప్పగూడెం గ్రామానికి చెందిన బెలిదె శంకర్ నిరూపిస్తున్నాడు. తన తండ్రి బెలిదె రమేష్ జ్ఞాపకార్థం సొంత ఆటోతో ఉచిత వైద్య సేవలకు శ్రీకారం చుట్టాడు.
స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం శివాలయం వాడకు చెందిన శంకర్.. అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారిని ఎలాంటి అద్దె తీసుకోకుండా తన సొంత ఆటోలో ఆసుపత్రులకు తరలిస్తున్నాడు. ఇప్పటికే తన వాడలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని సొంత ఖర్చులతో ఆసుపత్రులకు తీసుకెళ్లి మానవత్వాన్ని చాటుకున్నాడు.
ఈ సేవలను ఇప్పగూడెంకే పరిమితం చేయకుండా చుట్టుపక్కల గ్రామాలు, స్టేషన్ ఘన్‌పూర్ ప్రాంత ప్రజలకు కూడా అందించనున్నట్లు శంకర్ తెలిపారు. వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, అత్యవసర వైద్యం అవసరమైన పేదలకు ఉచితంగా రవాణా సేవలు అందిస్తానన్నారు.
ఆపద సమయంలో 9000351405 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు.. వెంటనే తన ఆటోతో వచ్చి ఆసుపత్రికి తరలిస్తానని శంకర్ తెలిపారు. ఈ సేవా వివరాలను తన ఆటోపై కూడా ప్రదర్శించినట్లు చెప్పారు.
తండ్రి జ్ఞాపకాన్ని కేవలం చిత్రపటానికి పూలమాల వేయడంతో సరిపెట్టకుండా, నలుగురికి ఉపయోగపడే సేవ చేయడమే నిజమైన నివాళి అని శంకర్ పేర్కొంటున్నారు. ఆయన చేస్తున్న సేవను గ్రామస్తులు అభినందిస్తున్నారు.


Comments