మరో అరుణాచలంగా పామిరెడ్డిపల్లి వైరాగ్యగిరి.
ఆలయ అభివృద్ధికి రూ.25 లక్షల సహాయం అందిస్తా.. ఎమ్మెల్యే.
పెద్దమందడి,అక్టోబర్12(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలోని వైరాగ్యగిరి క్షేత్రం మరో అరుణాచలంగా విరాజిల్లాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆకాంక్షించారు. సోమవారం వైరాగ్యగిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆయన తన సతీమణి శారదా రెడ్డితో కలిసి ఘనంగా ప్రారంభించి, మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణ చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైరాగ్యగిరి క్షేత్రం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఇక్కడ ప్రారంభించిన గిరి ప్రదక్షిణ అరుణాచల గిరి ప్రదక్షిణను తలపిస్తోందని పేర్కొన్నారు. ప్రతి నెలా మాస శివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వైరాగ్యగిరి ఆలయ అభివృద్ధికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. తాను శాసనసభ్యుడినైనా ప్రజాసేవకుడిగానే, స్వామివారి భక్తుడిగానే ఉంటానని తెలిపారు. శాసనసభ్యుడు కాకముందు నుంచే వైరాగ్యగిరి శివుడికి కృష్ణా జలాలతో అభిషేకాలు చేయించానని, భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.భగవంతుని సన్నిధిలోనే మనశ్శాంతి లభిస్తుందని, ఆధ్యాత్మికత మనిషికి ప్రశాంతతను అందిస్తుందని పేర్కొన్నారు. ఇంతటి వైభవంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించిన పామిరెడ్డిపల్లి గ్రామ నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమానికి వనపర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేద పండితులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొని మహాశివుడిని దర్శించుకున్నారు.


Comments