కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో సీఎం ఫొటో ఏదీ?
అధికారుల నిర్లక్ష్యంపై కౌన్సిలర్ విష్ణువర్ధన్, మార్కెట్ చైర్మన్ స్వప్న సదానందం ఆగ్రహం.
జమ్మికుంట, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై జమ్మికుంట మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ పొనగంటి విష్ణువర్ధన్, మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటో ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా జమ్మికుంట పట్టణానికి చెందిన 31 మంది, ఇల్లందకుంట మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు సంబంధిత అధికారులు నిబంధనలు, అధికారిక విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలని విష్ణువర్ధన్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫొటో ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలను అధికారులు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాల నిర్వహణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వ నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు
చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ పొనగంటి విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు.


Comments