అక్టోబర్ 16, 17 తేదీల్లో జిల్లా స్థాయి క్రీడా సంబరాలు.
ప్రతి మండలం క్రీడాకారులకు సువర్ణావకాశం
--వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,అక్టోబర్12(తెలంగాణ ముచ్చట్లు):
దసరా పండుగను పురస్కరించుకొని జిల్లాలో తొలిసారిగా అక్టోబర్ 16, 17 తేదీల్లో నిర్వహించనున్న వనపర్తి ఛాంపియన్‌షిప్ కప్-2026 ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ప్రతి మండలం నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, జట్లు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.ఛాంపియన్‌షిప్ నిర్వహణపై సోమవారం తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కీమ్యా నాయక్‌తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. క్రీడా మైదానాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, క్రీడాకారులకు భోజనం, వసతి, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ, వాలీబాల్, చెస్, క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్ (తాడులాగుడు) సహా ఏడు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 16న ఉదయం వనపర్తిలోని ప్రభుత్వ కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ప్రారంభ వేడుక జరగనుందని పేర్కొన్నారు.జట్టు క్రీడల్లో మొదటి బహుమతిగా రూ.20,000, రెండో బహుమతిగా రూ.10,000, మూడో, నాలుగో బహుమతులుగా రూ.5,000 చొప్పున అందించనున్నారు. వ్యక్తిగత క్రీడల్లో మొదటి బహుమతి రూ.5,000, రెండో బహుమతి రూ.3,000, మూడో, నాలుగో బహుమతులు రూ.1,500 చొప్పున ఇవ్వనున్నారు.క్రీడాకారులు మండల స్థాయి ఎంపికల కోసం సంబంధిత సెలక్షన్ కమిటీ సభ్యులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. వనపర్తి పట్టణ ప్రజలు, యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో క్రీడా ప్రాంగణాలకు తరలివచ్చి తమ మండల క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం తదితరులు పాల్గొన్నారు.


Comments