260 మంది పేదల పొట్టకొట్టి.. పెట్రోల్ బంక్ నిర్మిస్తారా?
-పంచరాయి భూమిని నిరుపేదలకే కేటాయించాలి..
భూమి సంరక్షణ సంఘం డిమాండ్
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 439లో ఉన్న పంచరాయి భూమిని కేంద్ర ప్రభుత్వ పెట్రోల్ బంక్ నిర్మాణానికి కేటాయించడంపై భూమి సంరక్షణ సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ భూమిపై ఆధారపడి జీవిస్తున్న 260 మంది పేద కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో భూమి సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కామేరా లక్ష్మణ్ మాట్లాడుతూ, పంచరాయి భూమిని సాగు చేసుకుంటూ 260 మంది పేద కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. పేదల బతుకులకు ఆధారంగా ఉన్న భూమిని పెట్రోల్ బంక్ నిర్మాణానికి కేటాయించడం వల్ల వారి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా భూమి కేటాయింపులు చేపట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు.
పేదల భూమి పేదలకే కేటాయించాలి
సర్వే నంబర్ 439లోని పంచరాయి భూమి కేటాయింపు అంశాన్ని అధికారులు పునఃపరిశీలించాలని, భూమిపై ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాల ప్రయోజనాలను కాపాడాలని సంఘం నాయకులు కోరారు. 260 కుటుంబాల జీవనోపాధికి భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పంచరాయి భూమి విషయంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో భూమి సంరక్షణ సంఘం ఉపాధ్యక్షురాలు జూపాక రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి గడ్డం సంధ్య, గడ్డం పూలమ్మ, గడ్డం సులోచన, కమిటీ సభ్యులు అక్కు సాంబయ్య, గుంటి నారాయణ, జాజల రాములు పాల్గొన్నారు. వీరికి మద్దతుగా రేణుకుంట్ల సాంబయ్య, పింగిలి సదానందం, రాధమ్మ, సమ్మయ్య తదితరులు నిరసనలో పాల్గొన్నారు.


Comments