బీసీ రక్షణ చట్టం తేవాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీ జేఏసీ నాయకుల డిమాండ్.
హుజురాబాద్, అక్టోబర్ 1(తెలంగాణ ముచ్చట్లు ):
బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని హుజురాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న డిమాండ్ చేశారు.
బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు గురువారం హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ గ్రౌండ్‌లో బీసీ రక్షణ చట్టంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చందుపట్ల జనార్ధన్, సందేల వెంకన్న మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీ రక్షణ చట్టం తరహాలో తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. బీసీలకు రక్షణ కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం ఆశించిన స్థాయిలో లేదని వారు పేర్కొన్నారు. స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో బీసీలకు కనీసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా స్పందించి తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, లేనిపక్షంలో బీసీల హక్కుల కోసం ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఆకుల సదానందం, ఉపాధ్యక్షులు కొలిపాక క్రాంతికుమార్, మామునూరి ప్రవీణ్ కుమార్, తాళ్లపల్లి రమేష్, మంచికట్ల మురళి, చిలుకమారి శ్రీనివాస్, బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రటరీ దేవసాని ప్రియదర్శిని, మంద బిక్షపతి (కె.ఆర్), కానుగంటి శ్రీనివాస్, గోస్కుల మధుకర్, గరవేనా శ్రీకాంత్, కన్నెబోయిన రాజయ్య, దాసరి మల్లేశం, పిల్లి రాజు, రావుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments