వనపర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.20 కోట్ల సాయం.
7,872 మంది లబ్ధిదారులకు ఆర్థిక చేయూత.. వైద్య అత్యవసరాలకు మరో రూ.9.18 కోట్ల సహాయం
వనపర్తి,అక్టోబర్01(తెలంగాణ ముచ్చట్లు):
అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయం సకాలంలో అందేలా వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి, లేఖా ఆధారిత వైద్య సహాయం ద్వారా నియోజకవర్గంలోని అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటివరకు 7,872 మంది లబ్ధిదారులకు రూ.19,98,40,700 ఆర్థిక సహాయం అందినట్లు పేర్కొంది. ఈ మొత్తంలో పేద కుటుంబాల్లో తీవ్రమైన అనారోగ్యానికి గురైన వారికి వైద్య ఖర్చుల భారాన్ని కొంతమేర తగ్గించేందుకు సహాయం అందించినట్లు తెలిపింది.అత్యవసరంగా, అధిక వ్యయంతో కూడిన వైద్యం అవసరమైన వారికి లేఖా ఆధారిత వైద్య సహాయం ద్వారా 469 మందికి రూ.9,18,50,000 విలువైన సహాయం అందించినట్లు వెల్లడించింది. ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు ఈ విధానంలోనూ అర్హులైన వారికి వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.ప్రభుత్వ సహాయం కోసం వనపర్తి నుంచి హైదరాబాద్‌కు పదేపదే వెళ్లాల్సిన ఇబ్బందులు లేకుండా వనపర్తి, హైదరాబాద్‌లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి దరఖాస్తుల పరిశీలన, అవసరమైన పత్రాల సమర్పణ, సంబంధిత అధికారులతో సమన్వయం, సహాయం మంజూరయ్యే వరకు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.ప్రతి నెలా సుమారు 1,200 నుంచి 1,500 వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను నమోదు చేయడంతో పాటు, అత్యవసర వైద్య అవసరాలకు సంబంధించిన 15 నుంచి 20 వరకు కేసులను పరిష్కరించేందుకు సహకరిస్తున్నట్లు పేర్కొంది. అర్హతను బట్టి లబ్ధిదారులకు రూ.10 వేల నుంచి రూ.5 లక్షలు, రూ.6 లక్షల వరకు సహాయం అందుతున్నట్లు తెలిపింది.వైద్య ఖర్చుల కారణంగా పేద కుటుంబాలు అప్పులపాలుకాకుండా ప్రభుత్వ పథకాల ద్వారా అందే సహాయాన్ని సకాలంలో అందించడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దరఖాస్తును కేవలం ఒక పత్రంగా కాకుండా సంబంధిత కుటుంబ సమస్యగా పరిగణించి ప్రతి దశలో సహకారం అందిస్తున్నట్లు తెలిపాయి.అర్హత ఉన్న కుటుంబాలకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ముఖ్యమంత్రి సహాయ నిధి, లేఖా ఆధారిత వైద్య సహాయం ద్వారా నియోజకవర్గంలో ఇప్పటివరకు అందిన సహాయం వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.


Comments