ఇందిరమ్మ రాజ్యంలో గుడిసెలకు చోటు లేదు.
ఇందిరానగర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ఘనపూర్ మున్సిపాలిటీకి రూ.60 కోట్ల నిధులు
నియోజకవర్గానికి ఇప్పటివరకు రూ.1,600 కోట్ల అభివృద్ధి నిధులు
– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కంట కన్నీరు రాకూడదని, ఇందిరానగర్‌లో ఒక్క గుడిసె కూడా లేకుండా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు ఇందిరానగర్‌లో గురువారం రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన పాఠశాల వంటగదిని, రూ.కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగు కాలువలను ఆయన ప్రారంభించారు.అనంతరం 8వ వార్డు కౌన్సిలర్ తోకల అనూష రాజు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇందిరానగర్‌లో గతంలో ఏడు ఇళ్లు మంజూరు కాగా ఐదు ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఇంకా గుడిసెలు, రేకుల షెడ్లలో నివసిస్తున్న అర్హులైన పేద కుటుంబాలను సర్వే చేయించి మరో 10 నుంచి 15 ఇళ్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరడంతో 2025 జనవరిలో స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ.15 కోట్ల విలువైన పనులకు పనులు అప్పగించే ప్రక్రియ చేపట్టామని తెలిపారు.
పట్టణంలో రూ.45 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి, రూ.26 కోట్లతో సమీకృత రెవెన్యూ సముదాయం, రూ.6.10 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.1,600 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.10వ, 18వ వార్డుల్లో తాగునీరు, మురుగు కాలువల సమస్యలను కౌన్సిలర్ పొన్న రవి తన దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, చిల్పూర్ గుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్‌రాజు, మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, తిరుమలనాథ దేవస్థాన చైర్మన్ నీల నర్సింహులు, కమిషనర్ రాధాకృష్ణ, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు సారంగపాణి, పోశాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Comments