గాంధీ ఆశయాలను మోదీ ప్రభుత్వం ఆచరిస్తోంది.
జమ్మికుంటలో మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.
జమ్మికుంట, అక్టోబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
మహాత్మా గాంధీ జీవితాంతం సనాతన ధర్మాన్ని విశ్వసిస్తూ రామనామాన్ని జపించారని, గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటకు వచ్చిన ఆయన స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
శ్రీరాముడిని సంపన్నుల దేవుడిగా పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను బండి సంజయ్ తప్పుబట్టారు. నిరాడంబర జీవితాన్ని గడిపిన మహాత్మా గాంధీ నిత్యం రామనామాన్ని జపించేవారని గుర్తుచేశారు. గాంధీజీ దృష్టిలో శ్రీరాముడు సత్యం, ధర్మం, న్యాయం, మానవతా విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. గాంధీజీ పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ నేతలపై ఆయన విమర్శలు చేశారు.
మహాత్మా గాంధీ పదవులను ఆశించలేదని, కుటుంబ వారసత్వ రాజకీయాలు, అవినీతిని వ్యతిరేకించారని బండి సంజయ్ అన్నారు. గాంధీజీ కలలు కన్న రామరాజ్యం, పేదలకు సంక్షేమ ఫలాలు అందడం, పారదర్శక పాలన, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలను మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు
రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన బండి సంజయ్.. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. కాంగ్రెస్ ముస్లిం ఓట్లపై ఆధారపడి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిందూ ఓటర్లను ఏకం చేసి కాంగ్రెస్‌కు రాజకీయంగా సమాధానం చెబుతామని అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల సమయంలోనే ప్రజల్లోకి వస్తున్నారని, మిగతా సమయంలో ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్నారని బండి సంజయ్
విమర్శించారు. భవిష్యత్తులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.


Comments