టవర్ సర్కిల్‌లో నిత్యం ‘వందేమాతరం’ గీతాలాపన.
*జాతీయ స్ఫూర్తిని చాటేలా టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కార్యక్రమం*
*నిత్యం వేలాది మంది రాకపోకల మధ్య ‘వందేమాతరం’ ప్రసారం.*
*ప్రజలు గౌరవసూచకంగా నిలబడాలని సునీల్ రావు పిలుపు*
కరీంనగర్, అక్టోబర్ 2(తెలంగాణ ముచ్చట్లు ):
నగరంలోని ప్రముఖ వ్యాపార, వాణిజ్య కూడలి టవర్ సర్కిల్‌లో ప్రతిరోజూ ఉదయం ‘వందేమాతరం’ గీతాలాపన ప్రారంభమైంది. టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోనే తొలిసారిగా టవర్‌పై పూర్తిస్థాయి ‘వందేమాతరం’ గీతాన్ని ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రసారం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ‘వందేమాతరం’ నినాదం కోట్లాది మంది స్వాతంత్ర్య సమరయోధుల్లో దేశభక్తి స్ఫూర్తిని రగిలించిందన్నారు. నేటి యువతతో పాటు నగర ప్రజల్లోనూ జాతీయ స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఉదయాన్నే వినిపించే గీతాలాపన ప్రజల్లో సానుకూల దృక్పథం, మానసిక ప్రశాంతతతో పాటు దేశం పట్ల అంకితభావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
నిత్యం వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే చారిత్రాత్మక టవర్ సర్కిల్‌లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు పూర్తి ‘వందేమాతరం’ గీతాన్ని ప్రసారం చేసేలా అసోసియేషన్ చేసిన ఏర్పాట్లు అభినందనీయమన్నారు. గీతం ప్రసారమయ్యే సమయంలో నగర ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు గౌరవసూచకంగా నిలబడి జాతీయ భావాన్ని చాటాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు వంగల పవన్, రామన్, టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు, టవర్ సర్కిల్ ప్రాంతానికి చెందిన వైశ్య సోదరులు, మహిళలు, నగర పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments