గాంధీజీ అడుగుజాడల్లో నడవడం అందరి బాధ్యత…
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.
ఖమ్మం బ్యూరో , అక్టోబర్- 2 (తెలంగాణ ముచ్చట్లు)
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అహింస, సత్యం అనే ఆయుధాలతో భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని నడిపించి, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు కాలాతీతమైనవని, నేటి సమాజానికి ఆయన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని అన్నారు. చెడును నిరోధిస్తూ, శాంతియుత మార్గంలో లక్ష్యాలను సాధించవచ్చని గాంధీజీ తన జీవితం ద్వారా నిరూపించారని పేర్కొన్నారు.
గాంధీజీ కలలు కనిన గ్రామ స్వరాజ్యం, పారిశుద్ధ్యం (స్వచ్ఛత) సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి రామూర్తి, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఫిరంగి, ఉప కోశాధికారి వేలాద్రి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Comments