జమ్మికుంటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీకి నివాళులు.
తెలంగాణ రక్షణ సేన పట్టణ నాయకుడు అంబాల హరీష్
జమ్మికుంట, అక్టోబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు సత్యం, అహింసను ఆయుధాలుగా మలిచిన మహాత్మా గాంధీ ఆశయాలు నేటి తరానికి సైతం మార్గదర్శకమని తెలంగాణ రక్షణ సేన జమ్మికుంట పట్టణ నాయకుడు అంబాల హరీష్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని జమ్మికుంట గాంధీ చౌరస్తాలో మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.
అంబాల హరీష్ మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సోదరభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీజీని కేవలం జయంతి రోజున స్మరించుకోవడం కాకుండా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ప్రజల మధ్య ఐక్యత, సామాజిక సమానత్వం, పరస్పర గౌరవం పెంపొందించేందుకు ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు కొత్తూరి నరేష్, కండె విజయ్, ఈదునూరు శశి, పర్లపెల్లి సదానందం, నీల అనిల్ తదితరులు పాల్గొన్నారు.


Comments