రాష్ట్ర పోలీస్ క్రీడల్లో ఏసీపీ మాధవి సత్తా ఐదు పతకాలు కైవసం.
నాలుగు స్వర్ణాలు, ఓ రజతం కైవసం.
జమ్మికుంట, అక్టోబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
విధి నిర్వహణలోనే కాదు.. క్రీడా మైదానంలోనూ హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా ఐదు పతకాలు సాధించారు. ఇందులో నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం ఉండటం విశేషం.
రాష్ట్రస్థాయి పోటీల్లో మాధవి కనబరిచిన ప్రతిభకు పోలీస్ శాఖలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. పోలీస్ విధుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ క్రీడల్లోనూ అద్భుత ప్రతిభ కనబరచి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. ఏసీపీ మాధవి విజయం పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆమె విజయాలు ఇతర పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
క్రీడల పట్ల ఆసక్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఐ రామకృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది ఆకాంక్షించారు.


Comments