ఘనంగా కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం.
* కుల వివక్ష నిర్మూలనకు ఐక్య పోరాటం అవసరం
* కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్
జమ్మికుంట, అక్టోబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
దేశంలో సమానత్వం నెలకొనాలంటే కుల వివక్షను నిర్మూలించాల్సిన అవసరం ఉందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్ అన్నారు. కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో శుక్రవారం జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఆయా వర్గాలను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దళితులపై దాడులు, వివక్ష కొనసాగుతున్నాయని పేర్కొంటూ, వాటిని అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
కేవీపీఎస్ 1998 అక్టోబర్ 2న ఆవిర్భవించిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళితుల సమస్యలపై సైకిల్ యాత్రలు, వివిధ పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, జస్టిస్ పున్నయ్య కమిషన్, దళితులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన ఉద్యమాల్లో కేవీపీఎస్ కీలకంగా పనిచేసిందన్నారు.
భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విద్య, వైద్యం ఉచితంగా అందేలా కేవీపీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను కొనసాగిస్తామని కిషోర్ తెలిపారు.
కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి జక్కుల రమేష్ యాదవ్, కేవీపీఎస్ మండల నాయకులు వి. సూర్యారావు, తెలంగాణ హమాలి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శనిగరపు చంద్రమోహన్, సిరికొండ మదనయ్య, రాజు, రజాక్, కిరణ్, రాజయ్య, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.


Comments