పాత డిగ్రీ కళాశాల భవనాన్ని హాస్టల్‌గా మార్చాలి.
* సుమారు వెయ్యి మంది విద్యార్థులకు వసతి కల్పించే అవకాశం
* కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఏబీవీపీ వినతి
జమ్మికుంట, అక్టోబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంటలో నిరుపయోగంగా ఉన్న పాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని హాస్టల్‌గా మార్చి విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జమ్మికుంట శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు ఏబీవీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సరైన హాస్టల్ వసతులు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వసతి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల కొందరు విద్యార్థులు హనుమకొండ, కరీంనగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు.
జమ్మికుంటలోని పాత డిగ్రీ కళాశాల భవనం ప్రస్తుతం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉందని, దానిని హాస్టల్‌గా వినియోగంలోకి తీసుకువస్తే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ భవనంలో సుమారు వెయ్యి మంది విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించే అవకాశం ఉందని తెలిపారు. స్థానికంగానే వసతి సౌకర్యం అందుబాటులోకి వస్తే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విద్యార్థులు జమ్మికుంటలోని కళాశాలల్లోనే ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం ఉంటుందని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాత డిగ్రీ కళాశాల భవనాన్ని హాస్టల్‌గా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జమ్మికుంట నగర కార్యదర్శి భోగం శశాంక్, స్టేట్ ఎస్‌ఎఫ్‌డీ కో-కన్వీనర్ గోస్కుల అజయ్, పాలిక నిరుప్ తదితరులు పాల్గొన్నారు.


Comments