అత్యవసర వేళ 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
-నవజాత శిశువుల కోసం ప్రత్యేక నియోనెటల్ అంబులెన్స్ సేవలు..
-జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్
భీమదేవరపల్లి, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
భీమదేవరపల్లి మండల ప్రజలు అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా 108 అంబులెన్స్ మేనేజర్ మండ శ్రీనివాస్ సూచించారు. గురువారం భీమదేవరపల్లి మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను ఆయన తనిఖీ చేసి, అందులోని వైద్య పరికరాలు, అత్యవసర మందులు, రికార్డులను పరిశీలించారు.
వర్షాకాలంలో విషపురుగుల కాట్లు, సీజనల్ వ్యాధులు, విద్యుత్ షాక్‌లు, రోడ్డు ప్రమాదాలు, ఇతర వైద్య అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు 108కు ఫోన్ చేసి అంబులెన్స్ సేవలు పొందాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణులు, అత్యవసర వైద్యం అవసరమైన వారికి సకాలంలో వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 108కు కాల్ వచ్చిన వెంటనే 30 సెకన్లలో అంబులెన్స్ బయలుదేరి, బాధితులకు ప్రాథమిక అత్యవసర వైద్యం అందిస్తూ సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
జనవరి నుంచి ఆగస్టు వరకు 756 మందికి ప్రాణదానం
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 756 మంది ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించిన 108 సిబ్బందిని మండ శ్రీనివాస్ అభినందించారు. అంబులెన్స్‌లోని వైద్య పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించి, ప్రతి బాధితుడికి నాణ్యమైన అత్యవసర వైద్య సేవలు అందించాలని సూచించారు.
నవజాత శిశువుల కోసం ప్రత్యేక అంబులెన్స్
హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో నవజాత శిశువుల కోసం ప్రత్యేక నియోనెటల్ అంబులెన్స్ అందుబాటులో ఉందని తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఏడాది వయస్సు వరకు ఉన్న చిన్నారులకు తక్కువ బరువుతో జన్మించడం, శ్వాస సంబంధిత సమస్యలు, ఫిట్స్, ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే 108కు ఫోన్ చేసి ప్రత్యేక నవజాత శిశు అంబులెన్స్‌ను కోరాలని సూచించారు.
ఈ ప్రత్యేక అంబులెన్స్‌లో వెంటిలేటర్, ఇంక్యుబేటర్, సిరంజి పంప్, ఏఈడీ యంత్రం, సక్షన్ పరికరం వంటి ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని వివరించారు. అవసరమైన చిన్నారులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి లేదా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి ఉచితంగా తరలించి వైద్య సేవలు అందించే సదుపాయం ఉందన్నారు. భీమదేవరపల్లి మండల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మున్నీరు, 108 ఈఎంటీలు రేణికుంట్ల విద్యాసాగర్, మేకల రవి, తేజస్విని, పైలెట్లు సులుగురి కృష్ణంరాజు, కవ్వంపల్లి సంపత్, కొట్టే సునీల్ పాల్గొన్నారు.


Comments