పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దండేపల్లి బీపీసీఎల్ ప్లాంట్ సన్నాహాలు విరమించాలి – మారుపాక అనిల్ కుమార్.
ఎల్కతుర్తి, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో బీపీసీఎల్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణానికి అధికారులు చేస్తున్న సన్నాహాలను తక్షణమే నిలిపివేయాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల భూముల పరిరక్షణ కోసం వారి పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
దండేపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 439లో మొత్తం 170 ఎకరాల 27 గుంటల ప్రభుత్వ భూమి ఉందని, 1992లో ఈ భూమిని 299 మంది నిరుపేదలకు పంపిణీ చేశారని అనిల్ కుమార్ తెలిపారు. భూమిలేని పేద కుటుంబాలకు జీవనాధారంగా ఉండాల్సిన భూమిలో బీపీసీఎల్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
అభివృద్ధి పేరుతో పేదల జీవనాధారాన్ని దెబ్బతీసే చర్యలను అనుమతించరాదని ఆయన స్పష్టం చేశారు. సర్వే నంబర్ 439కు సంబంధించిన అసలు భూ రికార్డులను బహిర్గతం చేయాలని, 1992లో భూములు పొందిన 299 మంది లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం భూములను సాగు చేసుకుంటున్న వారిని గుర్తించి, అర్హులైన సాగుదారులకు చట్టబద్ధమైన స్వాధీన హక్కులు కల్పించాలని కోరారు.
భూముల స్థితిగతులు, లబ్ధిదారుల హక్కులపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవాలని సూచించారు. బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణ సన్నాహాలను తక్షణమే విరమించుకుని, భూముల లబ్ధిదారులు, ప్రస్తుత సాగుదారుల హక్కులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు డీహెచ్‌పీఎస్ ప్రజల పక్షాన నిలబడి భూ పరిరక్షణ పోరాటాన్ని కొనసాగిస్తుందని మారుపాక అనిల్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సర్వే నంబర్ 439 భూ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు కామెర లక్ష్మణ్, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి నిమ్మల మనోహర్, రేణిగుంట్ల సాంబయ్య, గడ్డం రాజనర్సు, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.


Comments