ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి.

*నిరవధిక సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు.*

*ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, పెండింగ్ బకాయిలు చెల్లించాలి: యాదగిరి సునీల్ రావు.*

*కరీంనగర్, అక్టోబర్ 14(తెలంగాణ ముచ్చట్లు ):

తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద పనిచేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళనలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.

కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్య, ఆరోగ్య సిబ్బంది పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఎన్‌హెచ్‌ఎం సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం 60 శాతానికి పైగా వేతనాలు, ప్రోత్సాహకాలకు నిధులు సమకూరుస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం క్యాడర్ ఫిక్సేషన్ అమలు చేసి పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, ఉద్యోగులను స్టేట్ హెల్త్ సొసైటీ (ఎస్‌హెచ్‌ఎస్‌) పరిధిలోనే కొనసాగిస్తూ స్పర్శ్ (SPARSH) ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలన్నారు.

ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్ అందించాలని, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. విధుల్లో ఉండగా ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా లేదా బీమా అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి విద్యార్హత ఆధారంగా ఉద్యోగ అవకాశం కల్పించాలని అన్నారు. ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రతతో పాటు ఈహెచ్‌ఎస్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

గత కమిషనర్ ఆదేశాల ప్రకారం ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న తొమ్మిది నెలల పీఆర్సీ, బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవో నంబర్ 60, 1195 ప్రకారం పెంచిన వేతనాలను చెల్లించడంతో పాటు, వేతనాలు తగ్గిన ఉద్యోగులకు పూర్వపు వేతనాలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యోగుల హక్కుల సాధనకు మద్దతుగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని యాదగిరి సునీల్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.