వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు.
స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్.
కరీంనగర్, అక్టోబర్ 14(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ నగరంలోని 53వ డివిజన్ శర్మానగర్, 62వ డివిజన్ మంకమ్మతోటలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శర్మానగర్లో కాసుల అమృత శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో స్థానిక కార్పొరేటర్ కొంపెల్లి శ్వేత రమన్తో కలిసి మేయర్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని తిలకించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
అదేవిధంగా మంకమ్మతోటలో విముక్తి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 9వ వార్షిక శ్రీ దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మేయర్ పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మేయర్ కొలగాని శ్రీనివాస్ను గజమాల, శాలువాతో ఘనంగా సత్కరించగా, పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు అందజేశారు. రెండు ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణతో కళ్యాణ వేదికలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.


Comments