సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు.
*బొమ్మకల్లో వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు.*
కరీంనగర్, అక్టోబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బొమ్మకల్లో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ వేడుకలకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. గురువారం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి బొమ్మకల్ ప్రాంతంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
బొమ్మకల్ ప్రాంత ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ఏడు రోజుల పాటు నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో మహిళలు బతుకమ్మ ఆడే ప్రదేశాలతో పాటు చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాలను సందర్శించారు. వేడుకలకు వచ్చే మహిళలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరపాలక సంస్థ చేపట్టిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
బతుకమ్మ ఆడే ప్రదేశాలు, నిమజ్జన ఘాట్ వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు, ధ్వని వ్యవస్థ, బారికేడింగ్, ప్రదేశాలను చదును చేయడం, తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పండుగకు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వేడుకలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మేకల వెంకటేష్తో పాటు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments