మిషన్ భగీరథ నీరు మురుగు కాల్వల పాలు!
*తాగునీటి వృథాను అరికట్టాలి.. అధికారుల నిర్లక్ష్యాన్ని వీడాలి*
*మున్సిపాలిటీ, మిషన్ భగీరథ అధికారులకు బీసీ జేఏసీ నాయకుల డిమాండ్*
హుజురాబాద్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు వృథాగా రోడ్లపై ప్రవహిస్తూ మురుగు కాల్వల పాలవుతోందని బీసీ జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన విలువైన తాగునీరు ఇలా వృథా అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వృథాను వెంటనే అరికట్టి, పట్టణ ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ మున్సిపాలిటీ పాలకవర్గం, మిషన్ భగీరథ అధికారులను డిమాండ్ చేశారు.
హుజురాబాద్ పట్టణంలో గత కొన్ని రోజులుగా తాగునీరు వృథా అవుతున్నట్లు తెలుసుకున్న బీసీ జేఏసీ నాయకులు గురువారం విజయ డయాగ్నస్టిక్ కేంద్రం, కేరళ స్కూల్ పరిసర ప్రాంతాలతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఉపాధ్యక్షులు మామునూరి ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. తాగునీరు వృథాగా రోడ్లపై ప్రవహించి మురుగు కాల్వల్లో కలుస్తుండటం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాల్సిన అధికారులు, తమ కళ్లముందే తాగునీరు వృథా అవుతున్నా తగిన చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నీటి సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పైపులైన్లలో లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి నీటి సరఫరా జరుగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా, అవసరమైన మేరకు నీరు అందేలా సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించాలని కోరారు.
మున్సిపాలిటీ కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ తాగునీటి సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బీసీ జేఏసీ నాయకులు సూచించారు. పైపుల లీకేజీలను వెంటనే మరమ్మతులు చేయించడంతో పాటు, ఇళ్లకు నీరు సరఫరా అయ్యే పైపులకు అవసరమైన క్యాప్లు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మున్సిపాలిటీ పాలకవర్గం, మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత సిబ్బంది పట్టణంలోని నీటి వృథా ప్రాంతాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాగునీరు ప్రజల ప్రాథమిక అవసరమని, దానిని వృథా కాకుండా కాపాడటం అందరి బాధ్యతని పేర్కొంటూ, ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ నాయకులు కోరారు.


Comments