జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.*
*ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.*
కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన విలేకరులు పొత్తూరి శేఖర్, రాతిపల్లి సంపత్లను తెలంగాణ రక్షణ సేన, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ గారి ఆదేశాల మేరకు ఆసుపత్రికి వెళ్లి, బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులను భయపెట్టడం, బెదిరించడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘించడం తీవ్రమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించి, ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు స్వేచ్ఛగా విధులు నిర్వహించేందుకు భద్రత కల్పించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన జర్నలిస్టులకు అండగా ఉంటుందని, అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ, జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా నాయకులు శ్రీరాముల రమేష్, మ్యాకల తిరుపతి, బసవేణి రాజేందర్, మడిపల్లి వినీత్, చిట్టంపల్లి నాగరాజు, పల్లె శారద, కొత్తూరి రఘ తదితరులు పాల్గొన్నారు.


Comments