పల్లా జోలికొస్తే ఖబడ్దార్..!
కాంగ్రెస్ శ్రేణుల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత శీలం శ్యామ్ ఫైర్.
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
పల్లా రాజేశ్వర్ రెడ్డి జోలికొస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నాయకుడు శీలం శ్యామ్ హెచ్చరించారు. స్టేషన్ ఘన్పూర్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి మద్దతు లేకుంటే కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచేవారు కాదని అన్నారు. వేలేరు మండలం షోడశపల్లిలో సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ శ్రేణులను కడియంకు ఓటు వేయాలని పల్లా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.కేసీఆర్ అవకాశాలు ఇచ్చి ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం చేస్తే, కుమార్తెకు ఎంపీ టికెట్ ఇస్తే పార్టీ మారడం విశ్వాసఘాతుకమని విమర్శించారు. 30 ఏళ్ల కమిట్మెంట్ అంటున్న నాయకుడు.. ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.1,600 కోట్ల అభివృద్ధి నిధులతో ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. మరాజోడు రాంబాబు స్థాయి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థాయి కాదని, ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు.


Comments