కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్ని చేనేత సహకార సంఘాలకు మహర్దశ.
వెల్టూర్ ఉన్ని చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లు.
పెద్దమందడి,అక్టోబర్14(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని వెల్టూర్ ఉన్ని చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లు అన్నారు. ముఖ్యంగా ఉన్ని చేనేత సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనందించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న చేనేత సహకార సంఘాలపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) ద్వారా మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తూ, వివిధ సంఘాలకు ఉత్పత్తి ఆర్డర్లు అందజేయడం ద్వారా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురైన ఉన్ని చేనేత సహకార సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెంకటేశ్వర్లు తెలిపారు. ఉన్ని దుప్పట్ల ఉత్పత్తికి ఆర్డర్లు కేటాయించడం వల్ల కార్మికులకు తిరిగి ఉపాధి లభిస్తోందన్నారు.ఇటీవల తమ వెల్టూర్ ఉన్ని చేనేత సహకార సంఘానికి సుమారు రూ.2.5 కోట్ల విలువైన దారం సరఫరా చేయడం జరిగిందని చింతల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సరఫరా ద్వారా సుమారు 20 నెలల పాటు కార్మికులకు ఉపాధి పొందే అవకాశం ఏర్పడిందని వెల్లడించారు. ఈ సహకారంతో కార్మికులకు ఆర్థిక భరోసా లభించడంతో పాటు సంఘం కార్యకలాపాలు మరింత ముందుకు సాగేందుకు అవకాశం కలిగిందన్నారు. ఉన్ని దుప్పట్ల ఉత్పత్తికి అవసరమైన దారం సరఫరా చేయడం వల్ల కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఉన్ని చేనేత రంగ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డికి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ సంఘానికి ఉత్పత్తి ఆర్డర్లు అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్న హైదరాబాద్లోని చేనేత శాఖ కమిషనర్కు కూడా ధన్యవాదాలు తెలియజేశారు.తమ సంఘానికి సరఫరా అవుతున్న దారాన్ని భద్రపరిచేందుకు ప్రత్యేక భవనం అవసరమని చింతల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. భవనాన్ని మంజూరు చేస్తే దారాన్ని సురక్షితంగా నిల్వ చేసుకోవడంతో పాటు ఉత్పత్తి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందని తెలిపారు. తద్వారా కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడంతో పాటు సంఘం అభివృద్ధికి మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు.ఉన్ని చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం ఇదే విధంగా సహకారం కొనసాగించాలని, మరిన్ని ఉత్పత్తి ఆర్డర్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్ని చేనేత రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఈ రంగంపై ఆధార
పడిన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి లభిస్తుందని చింతల వెంకటేశ్వర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments