ఎండిన వరి పంటలకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి.
ఎం. ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి.
పెద్దమందడి,అక్టోబర్15:(తెలంగాణముచట్లు)
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని అల్వాల, మంగంపల్లి గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం. ఆంజనేయులు, జిల్లా కోశాధికారి ముత్యాలు పరిశీలించారు. అల్వాల గ్రామానికి చెందిన రైతులు జి. శ్రీనివాసులు, చిన్న రాములు పొలాలను సందర్శించి పంట నష్టాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ, పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎండిన ప్రతి ఎకరం వరి పంటకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని, బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, ప్రైవేటు అప్పుల వసూలు వేధింపులను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వ్యవసాయ పనులు లేక ఉపాధి కోల్పోయిన కూలీలకు ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి 200 రోజుల పని కల్పించాలని, ప్రత్యేక కరువు పరిస్థితుల దృష్ట్యా రోజుకు రూ.800 వేతనం చెల్లించాలని కోరారు. నష్టపోయిన రైతులు, వ్యవసాయ కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


Comments