స్టేషన్ ఘన్‌పూర్‌లో అత్యాధునిక ఎస్పీఎం షెడ్ ప్రారంభం.
విద్యుత్ నిర్వహణ పనులకు మరింత వేగం..
వినియోగదారులకు మెరుగైన సేవలు
టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు మధుసూదన్, మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
స్టేషన్ ఘన్పూర్,అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
విద్యుత్ నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించే లక్ష్యంతో స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక డిపార్ట్మెంటల్ ఎస్పీఎం షెడ్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. సంస్థ డైరెక్టర్లు (ఆపరేషన్స్) టి. మధుసూదన్, (ప్రాజెక్ట్స్) వి. మోహన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి షెడ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. స్టేషన్ ఘన్పూర్ డివిజన్ పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ వంటి కీలక పనులను మరింత వేగంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు ఈ నూతన ఎస్పీఎం షెడ్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.
విద్యుత్ శాఖ సిబ్బందికి అవసరమైన పరికరాలు, సామగ్రిని ఒకేచోట అందుబాటులో ఉంచడంతోపాటు, ఉద్యోగులకు మెరుగైన పని వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ షెడ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీనివల్ల అత్యవసర సమయాల్లో సిబ్బంది త్వరితగతిన స్పందించి విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అనంతరం నూతన షెడ్లో ఏర్పాటు చేసిన పరికరాలు, ఇతర సామగ్రిని డైరెక్టర్లు పరిశీలించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు, నిర్వహణ పనులను సమర్థవంతంగా చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీఈ (ఆపరేషన్స్-2) సురేందర్, ఎస్ఈ (ఆపరేషన్స్/జనగాం) చెరుకు సంపత్ రెడ్డి, డీఈలు విజయ్ కుమార్, బి. సారయ్య, అనిల్ కుమార్, ఈఈ (సివిల్) అనూప్ కుమార్, ఏడీఈలు బి. శ్రీధర్, పి. రణధీర్ రెడ్డి, ముంతాజ్ హుస్సేన్, ఏఈలు సుమన్, శంకర్, రణధీర్‌తోపాటు స్టేషన్ ఘన్పూర్ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments