కుమ్మరి వృత్తిని కాపాడాలి.
ఎంపీడీవోకు కుమ్మరి సంఘం వినతి.
పెద్దమందడి,అక్టోబర్05(తెలంగాణ ముచ్చట్లు):
సంప్రదాయ కుమ్మరి వృత్తిని కాపాడడంతో పాటు వృత్తిదారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం పిలుపు మేరకు వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కుమ్మరి సంఘం నాయకులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.కుమ్మరి వృత్తిదారులకు అవసరమైన బంకమట్టిని ఉచితంగా సేకరించేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, గ్రామాలకు బంకమట్టి రవాణాకు ఉచిత సౌకర్యం కల్పించాలని సంఘం నాయకులు కోరారు. మట్టి కుండలు, ప్రమిదలు, దీపాలు, కూజాలు, మట్టి గణపతి విగ్రహాలు తదితర సంప్రదాయ ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ కార్యాలయాలు, జాతరలు, ఉత్సవాలు, ప్రదర్శనల్లో మట్టి ఉత్పత్తులకు ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ప్లాస్టిక్, ఇతర ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగం పెరగడంతో మట్టి పాత్రలకు ఆదరణ తగ్గి కుమ్మరి కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతోందని నాయకులు తెలిపారు. వృత్తిని కొనసాగిస్తున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం, రుణ సదుపాయం, ఆధునిక పరికరాలు, శిక్షణ, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సరే అంజయ్య, పెద్దమందడి సర్పంచ్ సూర్య గంగమ్మ, రవి, మండల గౌరవ అధ్యక్షులు రాఘవేందర్, మండల యువజన అధ్యక్షులు చంద్రశేఖర్, మహేష్, సత్యం, బుచ్చన్న, ఆశన్నతో పాటు కుమ్మరి సంఘం నాయకులు, కుల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments