పత్తి ఎంఎస్ పి  కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి....

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.

పత్తి ఎంఎస్ పి  కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి....

ఖమ్మం బ్యూరో , అక్టోబర్-05(తెలంగాణ ముచ్చట్లు )

2026-27 సీజన్‌లో పత్తి కనీస మద్దతు ధర కు  కొనుగోళ్లను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో పత్తి కనీస మద్దతు ధర కొనుగోళ్ల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా పత్తి సాగు విస్తీర్ణం, అంచనా దిగుబడి, కొనుగోలు కేంద్రాలు, రైతుల నమోదు, నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం, వెయిమెంట్, చెల్లింపులు, భద్రత తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*  కేంద్ర ప్రభుత్వం 2026-27 సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి )ను క్వింటాల్‌కు రూ. 8,667గా నిర్ణయించిందన్నారు. 2025-26 సీజన్‌లో క్వింటాల్‌కు రూ. 8,110 ఉండగా, ప్రస్తుతం రూ. 557 పెంచినట్లు తెలిపారు. మీడియం స్టేపుల్ పత్తికి క్వింటాల్‌కు రూ. 8,267, లాంగ్ స్టేపుల్ పత్తికి క్వింటాల్‌కు రూ. 8,667 మద్దతు ధరగా నిర్ణయించబడిందని తెలిపారు.

2026-27 సీజన్‌లో ఖమ్మం జిల్లాలో 2,35,637 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గత ఏడాది 2,25,613 ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఈ ఏడాది 10,024 ఎకరాల మేర సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. 

*రైతుల వివరాలను కపాస్ కిసాన్ యాప్‌కు అనుసంధానం చేయాలి:*
పత్తి కొనుగోళ్లలో వ్యవసాయ శాఖ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. నిజమైన పత్తి రైతులను గుర్తించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కౌలు రైతులను తాత్కాలికంగా డేటాబేస్‌లో నమోదు చేసే విధానాన్ని అమలు చేయాలని తెలిపారు.

పత్తి సాగు చేస్తున్న రైతుల వివరాలను ఎన్ఐసి ద్వారా కపాస్ కిసాన్ యాప్‌కు బదిలీ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అగ్రి స్టాక్‌ను కపాస్ కిసాన్ యాప్‌తో అనుసంధానం చేసి రైతుల వివరాలు, సేవల పంపిణీని మరింత సులభతరం చేసేందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు, సిసిఐ సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

*అంతర్‌ జిల్లా మ్యాపింగ్‌ను ముందుగానే పూర్తి చేయాలి:*
పత్తి కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అంతర్‌ జిల్లా మ్యాపింగ్ ప్రతిపాదనలను ముందుగానే ఖరారు చేసి సిసిఐ పరిశీలనకు పంపాలని కలెక్టర్ సూచించారు. కొనుగోళ్లు ప్రారంభమయ్యే నాటికి అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు.

రైతులు తమ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురాక ముందే తేమ శాతాన్ని పరిశీలించుకునేలా జిల్లాలోని 129 రైతు వేదికల్లో మాయిశ్చర్ మీటర్లు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖను కలెక్టర్ ఆదేశించారు. తేమ శాతం అధికంగా ఉండటం వల్ల పత్తి తిరస్కరణకు గురికాకుండా రైతులకు ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు.

*టోల్‌ఫ్రీ, వాట్సాప్ నంబర్లపై విస్తృత ప్రచారం:*
పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు 1800 599 5779 టోల్‌ఫ్రీ నంబర్, 88972 81111 వాట్సాప్ నంబర్‌ను కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి రైతుల సమస్యలను ప్రతిరోజూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం ద్వారా పత్తి కొనుగోళ్లకు సంబంధించిన ఎఫ్ఏక్యూ ప్రమాణాలు, స్లాట్ బుకింగ్ విధానం, టోల్‌ఫ్రీ నంబర్, కొనుగోలు కేంద్రాల వివరాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. బ్రోచర్లు, వాల్ పోస్టర్లు, కర పత్రాలు, బ్యానర్లు, టీవీ చానళ్లతో పాటు బల్క్ మెసేజ్‌ల ద్వారా కూడా రైతులకు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

*కొనుగోలు స్లాట్ల వివరాలను ముందుగానే తెలియజేయాలి:*
సిసిఐ అధికారులు పత్తి కొనుగోలు స్లాట్ల ప్రారంభ వివరాలను జిల్లా కలెక్టర్, జిల్లా మార్కెటింగ్ అధికారి, మార్కెట్ కమిటీ కార్యదర్శులకు ముందుగానే అందించాలని కలెక్టర్ సూచించారు. తద్వారా రైతులకు ముందస్తుగా సమాచారం అందించి కొనుగోలు ప్రక్రియను క్రమబద్ధీకరించాలని తెలిపారు.

కొనుగోళ్లు ప్రారంభమైన వెంటనే అన్ని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లులను కార్యకలాపాల్లోకి తీసుకురావాలని సూచించారు. రైతులు సమీపంలోని జిన్నింగ్ మిల్లుకు పత్తిని తరలించుకునే అవకాశం కల్పించడం ద్వారా రవాణా ఖర్చు తగ్గుతుందని తెలిపారు. అన్ని మిల్లులను ఒకేసారి ప్రారంభించడం ద్వారా కొన్ని మిల్లుల్లో మాత్రమే ముడి పత్తి నిల్వలు పేరుకుపోకుండా నివారించవచ్చని పేర్కొన్నారు.

*8 జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై:*
2026-27 సీజన్‌లో ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం 8 జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఖమ్మం, మద్దులపల్లి, మధిర, వైరా ప్రాంతాల్లోని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

*అగ్నిమాపక భద్రతా పరికరాల తనిఖీలు పూర్తి చేయాలి:*
కొనుగోలు కేంద్రాలుగా ప్రతిపాదించిన జిన్నింగ్ మిల్లుల్లో అగ్నిమాపక భద్రతా పరికరాల తనిఖీలను అత్యవసరంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా అగ్నిమాపక అధికారి అన్ని ప్రతిపాదిత జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి, అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిన్నింగ్ మిల్లుల్లోని అన్ని వేయింగ్ బ్రిడ్జ్‌లను కొనుగోళ్లు ప్రారంభానికి ముందే తనిఖీ చేసి, క్యాలిబ్రేషన్‌ను నిర్ధారించాలని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు సీజన్ మొత్తం వేయింగ్ బ్రిడ్జ్‌లను తరచుగా తనిఖీ చేస్తూ ఖచ్చితమైన తూకం జరిగేలా చూడాలని సూచించారు. మాయిశ్చర్ మీటర్ రీడింగులు, ఎఫ్ఏక్యూ ప్రమాణాల రీడింగులు, వెయిమెంట్ డేటాను సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌తో డిజిటల్‌గా అనుసంధానం చేసే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డుల్లో అవసరమైన సమయంలో పోలీసు భద్రత కల్పించాలని కలెక్టర్ సూచించారు. పత్తి బేళ్ల రవాణాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

అన్ని పత్తి కొనుగోలు కేంద్రాలు, నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల్లో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

*కనీస మద్దతు ధర ప్రయోజనం పొందేందుకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి:*

కనీస మద్దతు ధర ప్రయోజనాలను పొందేందుకుIMG-20261005-WA0029 రైతులు ఆధార్ ఆధారిత ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. పత్తి కొనుగోలు, చెల్లింపుల ప్రక్రియను ఆధార్ ధృవీకరించిన బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయనున్నందు న రైతులు తమ ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సంతోష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, సిసిఐ, అగ్నిమాపక, లీగల్ మెట్రాలజీ, పోలీస్, రవాణా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామిడి తోటలో అడవి దున్న సంచారం. మామిడి తోటలో అడవి దున్న సంచారం.
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు): వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...
భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!
డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.