దళిత మహిళా సర్పంచ్‌పై దాడి ఘటనలో… ఘనపూర్‌లో వేడెక్కిన రాజకీయం.
నిందితులపై చర్యలు తీసుకోకుంటే వేలాది మందితో రాస్తారోకో
మున్సిపల్ ఎస్సీ సెల్ హెచ్చరిక
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని విశ్వనాథపురం గ్రామ దళిత మహిళా సర్పంచ్ గుర్రం యాదమ్మపై అక్రమ మద్యం విక్రయదారులు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై మున్సిపల్ ఎస్సీ సెల్ నాయకులు తీవ్రంగా స్పందించారు.విషయం తెలుసుకున్న ఘనపూర్ మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుర్రం ఫాతికుమార్, కమిటీ సభ్యులు ఆదివారం సర్పంచ్ యాదమ్మను కలిసి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని ఆమెకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దళిత మహిళా సర్పంచ్‌ను కులం పేరుతో దూషించి అవమానపరిచి, దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే మున్సిపాలిటీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వేలాది మంది దళితులతో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి తాటికొండ సున్నం యాదగిరి, టౌన్ కార్యదర్శి మాతంగి దేవయ్య, తిరుమలనాథ దేవస్థానం వైస్ చైర్మన్ తాటికొండ యాదగిరి, టౌన్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చేపూరి రమేష్, బాస్కుల రామచంద్రం, సింగపురం ఎల్లేష్, సింగపురం బాబు, గుర్రం వెంకటయ్య, నిరటి రవి, గద్దల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


Comments