హిమ్మత్‌నగర్ నుంచి జాతీయ స్థాయికి.. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్‌కు అవార్డు.
వీణవంక, అక్టోబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు):
వెడ్డింగ్ ఫోటోగ్రఫీ రంగంలో తన ప్రతిభను చాటుతూ వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన లక్కాకుల శ్రీనివాస్ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్‌లో ఆయన ‘సాప్ హెచ్‌ఎం రిబ్బన్’ అవార్డుతో పాటు రూ.వెయ్యి నగదు బహుమతిని అందుకున్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సాప్ ఫౌండర్ ఎం.సి. శేఖర్ చేతుల మీదుగా శ్రీనివాస్ అవార్డును స్వీకరించారు. గత 16 ఏళ్లుగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ రంగంలో కొనసాగుతున్న ఆయన.. తన సృజనాత్మకత, నైపుణ్యంతో జాతీయ స్థాయి పోటీలో గుర్తింపు పొందడం పట్ల వీణవంక మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ జాతీయ స్థాయిలో పురస్కారం అందుకోవడం మండలానికి గర్వకారణమని వీణవంక మండల ప్రెసిడెంట్ సంగెం మోహన్‌తో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా లక్కాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనకు సహకారం అందించిన అవార్డు నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఫోటోగ్రఫీ రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.


Comments