తొలగించిన అర్హుల ఓట్లను పునరుద్ధరించాలి.
ఎమ్మెల్యే మేఘా రెడ్డి .
వనపర్తి,అక్టోబర్03(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును పరిరక్షించడంలో ఎన్నికల సంఘం పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను పరిశీలించి వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఓటు ప్రతి పౌరుడికి ఉన్న విలువైన హక్కు అని, అర్హులైన ఒక్కరి పేరు కూడా అన్యాయంగా జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని, పేరు తొలగించిన వారికి కారణం తెలియజేసి అభ్యంతరం తెలిపే అవకాశం కల్పించాలని అన్నారు.పేదలు, వృద్ధులు, వలస కార్మికులు తదితరులకు ఓటు హక్కు విషయంలో ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా రాజ్యాంగానికి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని మేఘారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, తెలంగాణ జన సమితి నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Comments