కోతుల బెడద నుంచి పట్టణ ప్రజలను కాపాడాలి.
మున్సిపల్ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేసిన బీసీ జేఏసీ నాయకులు.
హుజురాబాద్,అక్టోబర్ (తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న కోతుల బెడదను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ నాయకులు మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా హుజురాబాద్ పట్టణ ప్రజలు కోతుల బెడద కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇళ్లలోకి కోతులు ప్రవేశించడం, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, చిన్నారులు, వృద్ధులు, మహిళలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు పలువురు ప్రాణభయంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
ప్రజల సమస్యను మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు అత్యవసరంగా పరిగణించి కోతుల నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు. పట్టణానికి సుదూరంగా ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి అక్కడ పండ్ల మొక్కలు పెంచడంతో పాటు కోతులను పట్టణంలోకి రాకుండా అటవీశాఖ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
కోతుల బెడద కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని బీసీ జేఏసీ నాయకులు అన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఉపాధ్యక్షులు మామునూరు ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రటరీ దేవసాని ప్రియదర్శిని, రామ్ సారయ్య, దాట్ల ప్రభాకర్, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments