కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం.
సీఐటీయూ ఆధ్వర్యంలో జమ్మికుంటలో ప్రదర్శన.
జమ్మికుంట, అక్టోబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు):
కార్మిక హక్కుల పరిరక్షణ, న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలనే డిమాండ్లతో సీఐటీయూ జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం ప్రదర్శన నిర్వహించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (డబ్ల్యూఎఫ్‌టీయూ) సందర్భంగా ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య 81వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను రక్షించడం, వారి సమస్యలను పరిష్కరించడం, శ్రమకు తగిన గౌరవం, న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. ఈ హక్కుల అమలు కోసం ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌టీయూ) పనిచేస్తోందని, దానిలో భాగమైన సీఐటీయూ దేశ, రాష్ట్ర స్థాయిల్లో కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు.
పరిశ్రమల్లో ఉత్పత్తికి కీలకమైన కార్మికుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కల్పిస్తున్నారని ఆయన విమర్శించారు. కార్మికుల భద్రత, హక్కులకు సంబంధించిన చట్టాల అమలులో నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపించారు. కార్మిక వర్గం ఐక్యంగా ఉండి తమ హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ జక్కుల రమేష్, జిల్లా కమిటీ సభ్యురాలు గేర రాజకుమారి, సాగర్ల కుమార్, మండల కమిటీ సభ్యులు మధునయ్య, పోచయ్య, కిరణ్, నాగరాజు, నరేష్, సంతు తదితరులు పాల్గొన్నారు.


Comments