నిర్మించారు.. వదిలేశారు!
అధికారుల నిర్లక్ష్యం.. నిద్రావస్థలో పంచాయతీ
తానేదార్‌పల్లిలో నిరుపయోగంగా మరుగుదొడ్డి
నీటి సౌకర్యం లేక ఏళ్లుగా తాళం
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
మరుగుదొడ్డి నిర్మించి.. ప్రారంభించడం మరిచిపోయిన ఘటన స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ, మహిళా సంఘం భవనం పక్కనే నిర్మించిన మరుగుదొడ్డి కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారింది.
ప్రజలు, అధికారులు, మహిళా సంఘాల సభ్యుల సౌకర్యం కోసం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించినప్పటికీ నీటి సౌకర్యం కల్పించకపోవడంతో మరుగుదొడ్డికి తాళం వేసి ఉంచారు. దీంతో పంచాయతీ కార్యాలయానికి వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు వాపోతున్నారు.ప్రజా అవసరాల కోసం నిర్మించిన మరుగుదొడ్డి వినియోగంలోకి రాకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరమైన మరమ్మతులు చేపట్టి, నీటి సౌకర్యం కల్పించి మరుగుదొడ్డిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు


Comments