మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా బైగళ్ల వీరబాబు.
మహబూబాబాద్, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
చేవెళ్ల డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షల ఆర్థిక సాయం విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు.గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించి, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఆ దిశగా ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేసి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేసే వరకు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
అనంతరం మాదిగ హక్కుల పరిరక్షణ సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బైగళ్ల వీరబాబును నియమించారు. ఈ కార్యక్రమంలో మందుల సంతోష్, మందుల శ్రీనివాస్, మందుల శ్రీను, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


Comments