మల్లన్నగండిలో మళ్లీ విషాదం.. వీడని మృత్యుఘోష.
స్నేహితుల కళ్లెదుటే నీటిలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.
చిల్పూర్,అక్టోబర్4(తెలంగాణ ముచ్చట్లు):
సరదాగా గడిపేందుకు స్నేహితులతో కలిసి రిజర్వాయర్‌కు వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతైన ఘటన జనగామ జిల్లా నర్మేట మండలం మల్లన్నగండి రిజర్వాయర్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పడాల కళ్యాణ్ (26) ఏడుగురు స్నేహితులతో కలిసి సికింద్రాబాద్ నుంచి మల్లన్నగండి రిజర్వాయర్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు.కళ్యాణ్ నీటిలో గల్లంతవడంతో స్నేహితులు ఆందోళనకు గురై స్థానికులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన కళ్యాణ్ ఆచూకీ కోసం స్టేషన్ ఘనపూర్ అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వరుస ప్రమాదాలతో ఆందోళన
మల్లన్నగండి రిజర్వాయర్ వద్ద ఇటీవల చోటుచే
సుకుంటున్న వరుస ప్రమాదాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ముగ్గురు యువకులు నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. రిజర్వాయర్ వద్ద తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రత ఎక్కడ..?
రిజర్వాయర్ అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రమాదకర ప్రాంతాల్లో కనీసం హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి అక్కడ పర్యాటకులు నీటిలోకి వెళ్లకుండా కట్టడి చేయాలని, తగిన భద్రతా చర్యలు చేపట్టి మరో కుటుంబానికి కన్నీరు మిగలకుండా చూడాలని వారు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.


Comments