గిరిజన హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం.

గిరిజన హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం.

హనుమకొండ, అక్టోబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు): 

గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు చేపడతామని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వి. వీరన్న నాయక్ తెలిపారు. తెలంగాణ గిరిజన సంఘం హనుమకొండ జిల్లా మూడో మహాసభను శనివారం హనుమకొండ గిరిజన భవన్ ప్రాంతంలో నిర్వహించారు.
బి. లాలు నాయక్, జగన్ నాయక్, సారయ్య, రమేష్ అధ్యక్షతన జరిగిన మహాసభకు వి. వీరన్న నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హనుమకొండ జిల్లాలో నివసిస్తున్న బంజారా, ఎరుకల తదితర గిరిజనుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాలను కోరారు. గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ చూపాలని డిమాండ్ చేశారు.గిరిజన రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి నియామకాలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలోనూ గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బంజారాలు మాట్లాడే గోర్బోలి భాషకు గుర్తింపు కల్పించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని మహాసభలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్న లంబాడి, ఎరుకల గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, ఆన్‌లైన్‌ కోచింగ్ ద్వారా శిక్షణ అందించి ఆర్థిక సహకారం కల్పించాలని అన్నారు. గిరిజన హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి కల్పించడంతో పాటు సిబ్బంది సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి తగినంత సిబ్బందిని నియమించాలని, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

హనుమకొండ పట్టణంలోని గిరిజన నిరుద్యోగులకు ఐటీడీఏ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రుణాలు మంజూరు చేయాలని, జిల్లా యూనిట్‌గా తీసుకుని రుణాల కేటాయింపు చేపట్టాలని కోరారు. శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి, తీజ్ పండుగ ఉత్సవాల నిర్వహణ కోసం హనుమకొండలో భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని మహాసభ విజ్ఞప్తి చేసింది.
గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు రాబోయే రోజుల్లో ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తామని నాయకులు తెలిపారు.ఈ మహాసభలో నాయకులు బోనార్తి రవి, ఆర్. సారయ్య, భూక్య సునీల్, గుగులోత్ విజయ్, లావుడియా రాఘవ, అజ్మీర దినేష్ తదితరులు పాల్గొన్నారు.IMG-20261004-WA0057

Tags:

Post Your Comments

Comments

Latest News