..ఇంకెన్ని శవాలు తేలితే మేల్కొంటారు..?

..ఇంకెన్ని శవాలు తేలితే మేల్కొంటారు..?

మల్లన్నగండి రిజర్వాయర్ వద్ద ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ ఆగ్రహం

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు): 

మల్లన్నగండి రిజర్వాయర్‌లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ ప్రశ్నించారు. ఆదివారం రిజర్వాయర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గల్లంతైన ఘటనపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి, మరో కుటుంబానికి ఆప్తుడైన వ్యక్తి ఒక్కసారిగా కనిపించకుండా పోతే ఆ కుటుంబాలు పడే వేదన వర్ణనాతీతమని గణేష్ అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే మరో ప్రమాదం జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టడమే అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.

కనీసం హెచ్చరిక బోర్డు కూడా లేదు

మల్లన్నగండి రిజర్వాయర్ వద్ద ప్రమాదకర ప్రాంతాల్లో కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమని గణేష్ మండిపడ్డారు. రిజర్వాయర్ అందాలను చూసేందుకు వచ్చే యువత ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సరదాగా గడిపేందుకు వచ్చిన యువత ప్రమాదంలో చిక్కుకుంటే వారి కుటుంబాలు జీవితాంతం కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “నిన్నటి వరకు నవ్వుతూ తిరిగిన వ్యక్తి ఇవాళ కనిపించకుండా పోయాడు. మరో తల్లి తన బిడ్డ కోసం, మరో భార్య తన భర్త కోసం కన్నీరు పెట్టే పరిస్థితి రాకముందే అధికారులు మేల్కొనాలి” అని అన్నారు.
మల్లన్నగండి రిజర్వాయర్ వద్ద ప్రమాదాల నివారణకు తక్షణమే హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను, రక్షణ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని గణేష్ డిమాండ్ చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని కోరారు.

 

Tags:

Post Your Comments

Comments

Latest News