భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ఆర్డీఓ కోసం వచ్చి నిరాశతో వెనుదిరిగిన నస్కల్ రైతులు.
స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు పేరుతో తమ భూములను సేకరించవద్దని చిల్పూర్ మండలం నస్కల్ గ్రామానికి చెందిన రైతులు స్పష్టం చేశారు. తమ భూములే జీవనాధారమని, వాటిని కోల్పోతే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.నస్కల్ గ్రామంలోని 143 సర్వే నంబర్ల పరిధిలో ఉన్న సుమారు 62 ఎకరాల భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని రైతులు తెలిపారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సోమవారం సుమారు 50 మంది రైతులు స్టేషన్ ఘనపూర్ ఆర్డీఓ కార్యాలయానికి తరలివచ్చారు.శనివారం ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది గ్రామానికి వచ్చి సోమవారం ఆర్డీఓను కలవాలని సూచించడంతో వ్యవసాయ పనులు మానుకుని కార్యాలయానికి వచ్చామని రైతులు తెలిపారు. అయితే ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చిందని వారు వాపోయారు.
పాత డీపీఆర్‌నే చూపిస్తున్నారని ఆరోపణ
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించిన కొత్త డీపీఆర్ చూపించాలని కోరగా, 2022లో రద్దయిన పాత డీపీఆర్‌నే చూపిస్తున్నారని రైతులు ఆరోపించారు. 2022లోనే రద్దయిన యూనిట్ ప్రతిపాదనను ఇప్పుడు మళ్లీ ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారో అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తమ భూములు పోతే జీవనాధారం కోల్పోతామని, భూములు సేకరిస్తే తమ కుటుంబాల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణకు ముందుకు వెళ్లవద్దని కోరారు.గతంలో దేవునూర్, రఘునాథపల్లి ప్రాంతాల్లో సేకరించిన భూముల్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల ద్వారా ఎంతమందికి ఉపాధి లభించిందో ప్రభుత్వం స్పష్టం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. భూసేకరణ వల్ల స్థానికులకు కలిగిన ప్రయోజనాలపై ప్రభుత్వం వివరాలు వెల్లడించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వినోబాభావే భూదానోద్యమ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గంటి చంద్రు, గంట ఉపేందర్, చాగంటి అనిల్, పాశం దాసు, ఇసాక్, దేవదానం, జేరిపోతుల వినోద్, వినయ్, చిట్యాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments