రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధి.
*రూ.23 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన*
*అభివృద్ధి పనులతో పాటు ఘనంగా దేవీ నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు*
*ప్రజా సమస్యలపై మేయర్ కొలగాని శ్రీనివాస్ పరిశీలన*
కరీంనగర్, అక్టోబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాజకీయాలు, పార్టీలకు అతీతంగా తమ పాలకవర్గం అంకితభావంతో పనిచేస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరపాలక సంస్థ సమగ్ర అభివృద్ధిలో భాగంగా సోమవారం 20వ డివిజన్ రేకుర్తి ప్రాంతంలో ఆయన పర్యటించారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేషం, స్థానిక కార్పొరేటర్లు పర్వతం మల్లేషం, సుధగోని మాధవి కృష్ణగౌడ్, కాంతాల జగన్‌రెడ్డిలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రేకుర్తిలోని బృందావనం
కాలనీలో నగరపాలక సంస్థ సాధారణ నిధులు రూ.9 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం హనుమాన్‌నగర్‌లో సుడా నిధులు రూ.14 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
రేకుర్తి ప్రాంతంలోని పలు కాలనీల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను మేయర్ స్వయంగా పరిశీలించారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, డ్రైనేజీ సమస్యలను తనిఖీ చేసి, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
*ఘనంగా బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలు*
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని మేయర్ తెలిపారు. ఆడబిడ్డలు ఆనందంగా బతుకమ్మ ఆడేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.


Comments