బోయినిపల్లి మండల కేంద్రానికి రూ.12 కోట్లతో మినీ స్టేడియం మంజూరు.
*యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కీలక ముందడుగు*
*క్రీడల మంత్రి వాకిటి శ్రీహరితో ప్రత్యేకంగా మాట్లాడి మంజూరు చేయించిన ఎమ్మెల్యే సత్యం*
*ఎమ్మెల్యే సత్యంకు కృతజ్ఞతలు తెలిపిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సువీన్ యాదవ్*
బోయినిపల్లి, అక్టోబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో రూ.12 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అక్టోబర్ 3న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర క్రీడల శాఖ ఆధ్వర్యంలో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు.
మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటుతో స్థానిక యువతకు క్రీడల్లో శిక్షణ పొందేందుకు, తమ ప్రతిభను చాటుకునేందుకు మెరుగైన వేదిక అందుబాటులోకి రానుంది. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు వివిధ క్రీడా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
మినీ స్టేడియం మంజూరుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవ తీసుకుని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో మాట్లాడి కృషి చేశారని బోయినిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ నిధుల నుంచి రూ.12 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చిందన్నారు.
మినీ స్టేడియం మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సువీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండల ప్రజలు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Comments