భూ రీసర్వే పనులను వేగవంతం చేయాలి.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.
పెద్దమందడి,అక్టోబర్05(తెలంగాణ ముచ్చట్లు):
భూ రీసర్వే పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో భూ రీసర్వేలో భాగంగా చేపడుతున్న గ్రామ సరిహద్దుల గుర్తింపు పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రైతులకు ముందస్తుగా నోటీసులు అందజేయడంతో పాటు గ్రామపంచాయతీలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సర్వే పనులను అక్టోబర్ 15లోగా పూర్తి చేయాలని, హద్దుల గుర్తింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అనంతరం ఒంటరి మహిళా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రమీల ఇంటికి వెళ్లిన కలెక్టర్ దరఖాస్తును పరిశీలించి వివరాలను స్వయంగా ధ్రువీకరించారు. పింఛన్ దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. బేస్‌మెంట్లను అనవసరంగా ఎత్తు పెంచి అదనపు ఖర్చు చేయవద్దని తెలిపారు. అవసరమైన ఆర్థిక సహాయం కోసం అర్హులైన లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బిల్లులు సకాలంలో అందేలా చూడాలని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులకు చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శిమియా నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, జెడ్పీ సీఈవో యాదయ్య, గ్రామ సర్పంచ్ చిట్యాల వెంకటయ్య తదితరులు ఉన్నారు.


Comments