రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం శూన్యం..
ప్రజావాణిలో తాటికొండ వృద్ధురాలి ఆవేదన
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
భర్తను కోల్పోయి రెండేళ్లు గడిచినా పింఛను మంజూరు కాకపోవడంతో ఓ వృద్ధురాలు అధికారుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరకు ప్రజావాణిని ఆశ్రయించింది.
స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన సల్ల కొమురమ్మ భర్త భిక్షపతి రెండేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. అప్పటి నుంచి వితంతు, వృద్ధాప్య పింఛను కోసం ఆమె అధికారులను సంప్రదిస్తూ వస్తోంది. అయితే ఇప్పటికీ పింఛను మంజూరు కాలేదని కొమురమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.సోమవారం స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం నాలుగు దరఖాస్తులు అందగా, అందులో కొమురమ్మ దరఖాస్తు కూడా ఉంది. ఈ సందర్భంగా అధికారుల ఎదుట తన సమస్యను వివరించిన ఆమె.. “రెండేళ్లుగా చెప్పులు అరిగేలా తిరుగుతున్నా.. పింఛను మాత్రం ఇవ్వడం లేదు” అంటూ కన్నీటి పర్యంతమైంది.తనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని, భర్త మృతి తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అధికారులకు వివరించింది. తనకు పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరింది.
డెత్ సర్టిఫికెట్ జారీలో జాప్యమే కారణం
అయితే కొమురమ్మ భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియలో జరిగిన జాప్యం కారణంగానే పింఛను మంజూరులో ఆలస్యం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో ఆమె నుంచి అర్జీ స్వీకరించిన అధికారులు సమస్యను పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.రెండేళ్లుగా పింఛను కోసం ఎదురుచూస్తున్న తన సమస్యను ఇకనైనా పరిష్కరించాలని కొమురమ్మ అధికారులను కోరింది.


Comments