డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
విద్యార్థులకు మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ వినయ్ సూచన.
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేస్తే జీవితంలో ఆశించిన స్థాయికి ఎదగలేరని, విద్యే జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ వినయ్ అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. చంద్రమౌళి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ఫ్రెషర్స్ స్వాగత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్య అంటే కేవలం ఉద్యోగం సంపాదించేందుకు ఉపయోగపడే సర్టిఫికెట్ మాత్రమే కాదని, అది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుందని అన్నారు. విద్య ద్వారా ఆలోచనా విధానం విశాలమవడంతో పాటు సమాజంలో బాధ్యతగల పౌరులుగా ఎదిగే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని, దానితో పాటు కమ్యూనికేషన్, టెక్నాలజీ పరిజ్ఞానం, ఇతర వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలనను అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.
చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ రాణించాలి
కళాశాల ప్రిన్సిపాల్ డా. చంద్రమౌళి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కళాశాల అన్ని విధాలుగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనగామ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. శ్రీనివాస్, అధ్యాపకులు డా. సురేష్ బాబు, డా. రమేష్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments