విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా - కడియం.
స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
విజయదశమి (దసరా) పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.దుర్గామాత మహిషాసురుడిని సంహరించి లోకానికి శాంతిని చేకూర్చిన రోజు, శ్రీరామచంద్రుడు రావణాసురుడిని అంతమొందించిన విజయ దినంగా మనం దసరాను జరుపుకుంటామని తెలిపారు. తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించిన అనంతరం వచ్చే విజయదశమి రోజున తలపెట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుందని పేర్కొన్నారు.ఆశ్వయుజ మాసంలో వచ్చే దసరా పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉందన్నారు. బతుకమ్మ సంబరాల అనంతరం వచ్చే దసరా రోజున గ్రామాలు, పట్టణాలు పండుగ శోభతో విలసిల్లుతాయని, శమీ పూజ నిర్వహించడం, జమ్మి ఆకును బంగారంగా భావించి పంచుకోవడం మన ఐక్యతకు నిదర్శనమని అన్నారు.
దుర్గాదేవి ఆశీస్సులతో రాష్ట్రం సకల శుభాలతో వర్ధిల్లాలని, నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి ఆర్థికంగా పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ పండుగను ప్రజలందరూ కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.


Comments